ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పెత్తందారుల చేతిలో అణచివేతకు గురైన వర్గాలకు తిరుగుబాటు తత్వాన్ని నేర్పించి, ప్రతిఘటన పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు.చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని శనివారం చిట్కుల్‌లోని ఐలమ్మ విగ్రహానికి నీలం మధు ముదిరాజ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర త్యాగధనుల అమరత్వంతో ముడిపడి ఉందన్నారు. ఆ మహనీయుల ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ సమాజంలో ప్రశ్నించే తత్వం, పోరాట స్ఫూర్తి అలవడిందని పేర్కొన్నారు.నిజాం నిరంకుశ పాలనలో అణచివేతకు గురైన ప్రజల కోసం, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా, దొరలు, జమీందారుల చేతుల్లో బానిసలుగా మగ్గుతున్న బహుజనులకు అండగా నిలిచి పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. హక్కులు, ఆత్మగౌరవం, సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.బహుజనుల కోసం పోరాడిన మహనీయుల స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే సంకల్పంతో సబ్బండ వర్గాల ప్రతినిధిగా చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని చిట్కుల్‌లో ఏర్పాటు చేసినట్లు నీలం మధు ముదిరాజ్ గుర్తుచేశారు.ఆ మహనీయుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆశయాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తోందని ఆయన పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లోని మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ప్రభుత్వం ఆమెకు గుర్తింపు కల్పించిందన్నారు.రేవంత్ రెడ్డి స్ఫూర్తితో సబ్బండ వర్గాలు, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడుతూ వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని నీలం మధు ముదిరాజ్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ మోతె సుమలత, కౌన్సిలర్లు సంగన్నగారి గోపాల్, దస్తగిరి, వెంకటేష్, ఆంజనేయులు, మాజీ సర్పంచ్ సుంకరి రవీందర్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ పొట్టి నారాయణ రెడ్డి, నర్సింగ్ యాదవ్, రజక సంఘం సభ్యులు చాకలి సత్యనారాయణ, చాకలి బాబు, చాకలి అర్జున్, చాకలి యాదయ్య, చాకలి రవి, చాకలి కిషోర్, చాకలి చందు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు