ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పేదల హక్కుల కోసం పోరాడాలి వట్టిపల్లి: వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా సీఐటీయూ వట్టిపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీఐటీయూ వట్టిపల్లి మండల కార్యదర్శి కామ్రేడ్ ఎర్రోళ్ల మహేష్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ఐలమ్మ ధైర్యంగా నిలబడి పోరాడారని గుర్తుచేశారు.తన భూమిని, హక్కులను కాపాడుకోవడానికి ఐలమ్మ చూపిన తెగువ పేదలు, రైతులు, మహిళలకు స్ఫూర్తినిచ్చిందన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ సమాజంలో దోపిడీ, వివక్ష, అన్యాయాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.చాకలి ఐలమ్మ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదని, పేదల ఆత్మగౌరవానికి, మహిళా ధైర్యానికి, భూమి కోసం సాగిన రైతాంగ పోరాటానికి ప్రతీక అని ఎర్రోళ్ల మహేష్ అన్నారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఐలమ్మకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నరేందర్ గౌడ్, వెంకటేష్, లక్ష్మణ్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు