ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు గురువారం ఉచితంగా లాంగ్ నోటు పుస్తకాలను ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన పాఠ్య, నోటు పుస్తకాలను ఉచితంగా అందజేస్తోందన్నారు. ఒక్కో విద్యార్థికి 12 నాణ్యమైన లాంగ్ నోటు పుస్తకాలను ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు.నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుమారు 900 మంది విద్యార్థులు చదువుతుండటం అభినందనీయమన్నారు. కళాశాల రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించడం నియోజకవర్గానికే గర్వకారణమని పేర్కొన్నారు. ఈ ఘనత సాధించేందుకు కృషి చేసిన అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులను అభినందించారు.విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమై ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు ప్రతి మండల కేంద్రంలో గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రంథాలయానికి తన సొంత నిధులతో రూ.50 వేల విలువైన పుస్తకాలను త్వరలో అందజేస్తానని హామీ ఇచ్చారు.గతంలో కళాశాలను సందర్శించిన సందర్భంగా అత్యధిక మార్కులు సాధించి ప్రథమ ర్యాంకు పొందే విద్యార్థికి తన తండ్రి స్వర్గీయ పట్లోళ్ల కిష్టారెడ్డి పేరుతో నిర్వహిస్తున్న పీకేఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బంగారు పతకం అందజేస్తామని ప్రకటించిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తుచేశారు. తన తండ్రి జన్మదినమైన అక్టోబర్ 2న ఆ బంగారు పతకాన్ని అందజేస్తామని తెలిపారు.డబ్బు, పదవి, విద్య సమాజంలో మంచి విలువలు, గౌరవం సాధించేందుకు ముఖ్యమైనవని సంజీవరెడ్డి అన్నారు. డబ్బు, పదవి అందరికీ లభించకపోవచ్చని, విద్య మాత్రం ప్రతి ఒక్కరూ కష్టపడి సాధించగలిగే సంపద అని పేర్కొన్నారు. విద్య ద్వారా జ్ఞానం, ఆత్మవిశ్వాసం, మంచి వ్యక్తిత్వం ఏర్పడటంతో పాటు సమాజంలో మంచి పేరు, గౌరవం లభిస్తాయని తెలిపారు.విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులకు, గురువులకు, నారాయణఖేడ్ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వర్ కళాశాల ప్రిన్సిపాల్, సత్యనారాయణ వైస్ ప్రిన్సిపాల్, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు