ప్రజా పిలుపు / తెలంగాణ / రంగారెడ్డి : శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనం సందర్భంగా గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు అదుపుతప్పి వినాయక విగ్రహంతో సహా వాగులో పడిపోయాడు.నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పడంతో యువకుడు విగ్రహంతో పాటు నీటిలో పడిపోయాడు. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి తీవ్ర గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. యువకుడు నీటిలో కాకుండా కింద ఉన్న కఠిన ప్రదేశంలో పడిపోయి ఉంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. నిమజ్జనాల నేపథ్యంలో అధికారులు ముందస్తుగా తగిన భద్రతా చర్యలు చేపట్టారా? బ్రిడ్జి వద్ద బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారా? నిమజ్జన ప్రాంతంలో తగినంత మంది భద్రతా సిబ్బందిని అందుబాటులో ఉంచారా? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు చేపట్టడం కంటే ముందుగానే ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు. నిమజ్జన సమయంలో యువత, భక్తులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
Admin
ప్రజా పిలుపు