ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని పటాన్‌చెరు సీఐ రవీందర్ గణేష్ ఉత్సవాల నిర్వాహకులకు సూచించారు. రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్ సూచనల మేరకు బుధవారం సాయంత్రం పటాన్‌చెరులోని ముదిరాజ్ సంఘం భవన్‌లో గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సమావేశానికి పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన గణేష్ ఉత్సవాల నిర్వాహకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐ రవీందర్ మాట్లాడుతూ గత ఏడాది పోలీస్‌స్టేషన్ పరిధిలో 495 గణేష్ మండపాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుశాఖ అనుమతి తీసుకోవాలని సూచించారు.గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన, ఉత్సవాలు, ఊరేగింపులు, నిమజ్జనం సందర్భంగా పోలీసుశాఖ సూచించిన నిబంధనలు, భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రధాన రహదారులపై మండపాల ఏర్పాటుతో ట్రాఫిక్‌కు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.గణేష్ ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని సీఐ రవీందర్ స్పష్టం చేశారు. ప్యాడ్ బ్యాండ్, మిక్సర్ తదితర అధిక శబ్ద పరికరాలు లేకుండా ఒక్క స్పీకర్‌తో నిర్వహించే మండపాలకు మాత్రమే నిబంధనల మేరకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. పటాన్‌చెరును డీజే రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు నిర్వాహకులు పోలీసుశాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ నెల 14వ తేదీ నుంచి గణేష్ విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యే వరకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో అవసరమైన భద్రతా చర్యలు చేపడతామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రత కల్పిస్తామని, ఉత్సవాల నిర్వాహకులు పోలీసుశాఖకు సహకరించాలని కోరారు.గణేష్ పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఐ రవీందర్ సూచించారు. ఈ సమావేశంలో ఎస్సైలు మహేశ్వర్ రెడ్డి, వినోద్, అభిమాన్ సింగ్, పోలీసు సిబ్బంది, వివిధ గ్రామాలకు చెందిన గణేష్ ఉత్సవాల నిర్వాహకులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు