ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నవభారత్ నిర్మాణ్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు.జర్నలిస్టులకు ఉద్యోగ, ఆరోగ్య, నివాస భద్రత కల్పించాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులందరికీ నిబంధనల ప్రకారం ఇంటి స్థలాలు కేటాయించాలని, వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఆరోగ్య సదుపాయాలు కల్పించేలా ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని అన్నారు. అర్హత ఉన్న వారికి ఎలాంటి జాప్యం లేకుండా అక్రిడిటేషన్ కార్డులు అందించాలని కోరారు.జర్నలిస్టులు, మీడియా సంస్థలపై దాడులు, బెదిరింపులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని, జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ఉద్యోగుల ఆర్థిక భద్రత కోసం తగిన వేతన విధానం అమలు చేయాలని, పని గంటలు, సెలవులు, ఉద్యోగ భద్రతకు సంబంధించిన నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.జర్నలిస్టుల హక్కులు, సంక్షేమంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని మెట్టు శ్రీధర్ కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే జర్నలిస్టు సంఘాలతో కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Admin
ప్రజా పిలుపు