ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : బొల్లారం, సెప్టెంబర్ 16: ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధవాని కుంట వద్ద గణేశ్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. ఐడీఏ బొల్లారం పోలీస్ ఇన్‌స్పెక్టర్ వి. సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో, సీఎంసీ అధికారుల సహకారంతో నిమజ్జన ప్రదేశంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.నిమజ్జన కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విగ్రహాల నిమజ్జనం కోసం భారీ క్రేన్లు, పరిసర ప్రాంతాల్లో తగిన లైటింగ్, భక్తుల భద్రత కోసం బారికేడింగ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.బుధవారం ఐడీఏ బొల్లారం పోలీస్ ఇన్‌స్పెక్టర్ వి. సుధీర్ కుమార్ పోలీసు సిబ్బంది, సీఎంసీ అధికారులతో కలిసి మాధవాని కుంటను సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లైటింగ్, బారికేడింగ్, క్రేన్లు, సీసీటీవీ కెమెరాలు, పార్కింగ్ తదితర ఏర్పాట్లను పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.అదేవిధంగా మియాపూర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నరసింహారెడ్డి మాధవాని కుంటను సందర్శించి ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనం సమయంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్, వాహనాల దారిమళ్లింపు, ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాల ఏర్పాట్లపై సిబ్బందికి సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ వి. సుధీర్ కుమార్ మాట్లాడుతూ భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ సీఎంసీ అధికారుల సమన్వయంతో నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు. భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా పూర్తయ్యేందుకు సహకరించాలని కోరారు.
Admin
ప్రజా పిలుపు