ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : * * పిల్లలకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలతో పాటు బంగారు భవితకు బాటలు వేయవచ్చని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. 9వ పోషణ మాసం సందర్భంగా శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో మన అంగన్వాడీ–మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసం కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారికి అవసరమైన పౌష్టికాహారం, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోషణపై అవగాహన కార్యక్రమాలు ఒక నెలకే పరిమితం కాకుండా నిరంతరం కొనసాగించేలా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లలు అంగన్వాడీ కేంద్రాల కు క్రమం తప్పకుండా తీసుకువెళ్లాలని తల్లులకు సూచించారు . అంగన్వాడీసేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు తల్లిదండ్రులు ప్రతి నెలా పిల్లల ఎత్తు, బరువును నమోదు చేయించి, వారి ఎదుగుదలకు అనుగుణంగా అవసరమైన పోషకాహారం అందేలా చూడాలన్నారు. పిల్లలను ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని, అక్కడ పౌష్టికాహారంతో పాటు ఆటలు, పాటలు, బొమ్మల ద్వారా ప్రాథమిక విద్య అందిస్తున్నట్లు తెలిపారు.బాలామృతంతో పాటు ఇతర పౌష్టికాహారాన్ని కూడా పిల్లలకు అందించాలని, తీవ్రమైన, మధ్యస్థ పోషకాహార లోపం, తక్కువ బరువు ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. సూపర్‌వైజర్లు, సీడీపీఓలు తమ పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు. తెలంగాణను మిల్లెట్స్ ఫుడ్ స్టేట్‌గా పిలుస్తారని కలెక్టర్ తెలిపారు . పోషక విలువలు అధికంగా ఉండే చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో భాగంచేసుకోవాలనిసూచించారు.కూరగాయలు,ఆకుకూరలు, నువ్వులు, బెల్లం, మునగ ఆకులు, కాయధాన్యాలు తదితర పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను గర్భిణులు, బాలింతలు, మహిళలు వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ పౌష్టికాహార ప్రదర్శనలను కలెక్టర్ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, బియ్యం సరఫరా తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన బియ్యం, పౌష్టికాహారం అందేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ప్రతి కేంద్రంలో తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల భవనాల స్థితిగతులను పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ-స్కూల్ నిర్వహణ, సరఫరాల్లో లోపాలు, ఇతర సమస్యలను గుర్తించి పరిష్కరించాలని తెలిపారు.ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలకు బేబీ వెయింగ్ మిషన్లను పంపిణీ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణులకు సామూహిక సీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు.అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా పోషణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.ఐదేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపాలు, వినికిడి లేదా మాట సమస్యలు, నడకలో ఇబ్బందులు, పుట్టుకతో వచ్చే లోపాలు, మెదడు సంబంధిత సమస్యలు, రక్తహీనత లేదా పోషకాహార లోపాలను గుర్తించిన వెంటనే అంగన్వాడీ సిబ్బందికి సమాచారం అందించి, అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏరియా ఆసుపత్రుల్లో అవసరమైన ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. మహిళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి పోషణ మాసం లక్ష్యాలను సాధించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి లలిత కుమారి, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డీఆర్‌డీఓ జ్యోతి, జిల్లా వైద్యాధికారిణి లలితాదేవి, ఐసీడీఎస్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, గర్భిణులు, బాలింతలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు