ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : విద్యార్థుల ప్రవర్తనలో అసాధారణ మార్పులు కనిపిస్తే వెంటనే పోలీసు అధికారులకు సమాచారం అందించి, వారు మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుందని అన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల ప్రభావాన్ని అరికట్టేందుకు పోలీసు, ఎక్సైజ్, విద్య, సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చి నివసిస్తున్న వారి ద్వారా గంజాయి తదితర మాదకద్రవ్యాలు జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున అనుమానాస్పద ప్రాంతాలు, వ్యక్తులపై నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా విద్యా సంస్థల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థుల ప్రవర్తనలో అసాధారణ మార్పులు గమనించిన వెంటనే పోలీసు శాఖకు సమాచారం అందించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.విద్యా సంస్థలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు నిషేధమని, నిబంధనలు ఉల్లంఘించి విక్రయాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మెడికల్ షాపుల్లో నిషేధిత మందులు, డ్రగ్స్ విక్రయించకుండా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు.మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులు, యువతతో పాటు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ధనరాజ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్, జిల్లా సంక్షేమ అధికారి శారద, పోలీసు అధికారులు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు