ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : వట్టిపల్లి: ఆశా వర్కర్లపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, వారి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో వట్టిపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐటీయూ వట్టిపల్లి మండల కార్యదర్శి కామ్రేడ్ ఎర్రోళ్ల మహేష్ మాట్లాడుతూ.. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ప్రజాపాలన అంటూనే మరోవైపు నిర్బంధాలతో పోరాటాలను అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదన్నారు. నిర్బంధాలతో కార్మికుల పోరాటాలను ఆపలేరని స్పష్టం చేశారు.ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 14న ప్రజావాణిలో సమర్పించిన వినతిపత్రంలోని డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు.ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వెలువడకపోతే ఫిక్స్‌డ్ వేతనం అమలయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని మహేష్ హెచ్చరించారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు నిరవధిక సమ్మెకు సిద్ధమవుతారని తెలిపారు.ప్రభుత్వ నిర్బంధ వైఖరిని నిరసిస్తూ వట్టిపల్లి మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ వట్టిపల్లి మండల అధ్యక్షురాలు స్వప్న, యూనియన్ నాయకురాలు యాదమ్మతో పాటు నీరజ, సుమిత్ర, విజయలక్ష్మి, రోజా, మల్లీశ్వరి, అనూరాధ, బాలమణి, సావిత్ర, ప్రవీణ, శ్రావ్య, రాజమణి, స్వరూప, అనిత తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు