ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : ** రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు గూడెం మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలపై స్పందించి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో లక్ష మంది రేషన్ డీలర్లతో హైదరాబాద్‌లో భారీ నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి గౌరవ వేతన సాధన సభ, నూతన రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుతో కలిసి గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలోనూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడంలో రేషన్ డీలర్లు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉంటూ పల్లె నుంచి పట్టణం వరకు నిరంతరం సేవలందిస్తున్న రేషన్ డీలర్లు దశాబ్ద కాలంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రేషన్ డీలర్లకు ఇచ్చిన ప్రధాన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమలు చేయలేని హామీలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాటిని నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. రేషన్ డీలర్ల సంక్షేమం కోసం నిరంతరం అండగా ఉంటానని, వారి డిమాండ్ల సాధనకు తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.గజ్వేల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల గౌరవ వేతన సాధన సభతో పాటు నూతన రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. రేషన్ డీలర్ల సమస్యలు, సంక్షేమం, గౌరవ వేతనం తదితర అంశాలపై నాయకులు చర్చించారు.ఈ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు, సంఘం ప్రతినిధులు, రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన రేషన్ డీలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు