ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : వీరనారి చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.చాకలి ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, శాసనసభ్యులు చింతా ప్రభాకర్ చాకలి ఐలమ్మ విగ్రహానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళు లర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, సామాజిక అన్యాయాలను ఎదురించి, అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ప్రతికూల పరిస్థితులను సైతం లెక్కచేయకుండా ఆమె ప్రదర్శించిన ధైర్యం, ఆత్మవిశ్వాసం, పోరాట పటిమ ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు.వెనుకబడిన తరగతుల విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని యువత ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీష్, సహాయ అధికారులు అమర్ జ్యోతి, అమర్నాథ్, వసతి గృహ సంక్షేమ అధికారులు, టీఎన్జీవోస్ నాయకులు జావిద్ అలీ, రవి, రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్, జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ పాటిల్, జిల్లా రజక సంఘం అధ్యక్షులు నామాల నగేష్, యువజన సంఘాల జిల్లా అధ్యక్షుడు కూర వేణుగోపాల్, వివిధ కుల సంఘాల నాయకులు ఆశన్న గౌడ్, ఇప్పపల్లి నరసింహులు, కుమ్మరి సాయిలు, మాణిక్యం, జై లాల్ నాయక్, గోరుకంటి రమేష్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు