ప్రజా పిలుపు / తెలంగాణ / కామారెడ్డి : కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో 52 ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్ కాయిల్స్ చోరీకి పాల్పడిన అంతర్‌జిల్లా ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లాలో 29, మెదక్ జిల్లాలో 23 ట్రాన్స్‌ఫార్మర్లలో చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ముఠా ఒక హత్యాయత్నం, రాత్రి వేళ ఇంటి దొంగతనానికి కూడా పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించిన పోలీసులు సెప్టెంబర్ 11న భిక్కనూర్ మండలంలోని పరివార్ హోటల్ సమీపంలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అరెస్టైన నిందితులు అన్నదమ్ములేనని, జల్సాలు, ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.నిందితుల నుంచి యమహా ఎఫ్‌జెడ్ వాహనం, 30 కిలోల కాపర్ వైర్, మొబైల్ ఫోన్, చోరీకి ఉపయోగించిన పలు పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కేసును ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర అభినందించారు.
Admin
ప్రజా పిలుపు