ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : చిట్కుల్ దేశ భవిష్యత్తు చిన్నారుల ఆరోగ్య భద్రతపైనే ఆధారపడి ఉంటుందని, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు.పల్స్ పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తన స్వగ్రామం చిట్కుల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలియో శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక వైద్య సిబ్బందితో కలిసి చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలియో మహమ్మారిని దేశం నుంచి పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా పల్స్ పోలియో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా తమ పిల్లలకు ప్రతి విడతలో తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.గతంలో పోలియో చుక్కలు వేసినప్పటికీ ప్రభుత్వం నిర్వహించే ప్రతి పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదేళ్లలోపు చిన్నారులందరికీ మళ్లీ చుక్కలు వేయించడం సురక్షితమే కాకుండా, వారి రోగనిరోధక శక్తిని మరింత బలోపేతం చేస్తుందని వివరించారు. ఒకప్పుడు దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన పోలియోను నిరంతర టీకా కార్యక్రమాల ద్వారానే నియంత్రించగలిగామని, అదే పట్టుదలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య, ఆరోగ్య రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు కూడా కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.మెదక్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా వంద శాతం పోలియో చుక్కల పంపిణీ లక్ష్యాన్ని సాధించాలని సూచించారు.ఎండలు, వర్షాలను లెక్కచేయకుండా ఇంటింటికీ వెళ్లి ప్రజలకు సేవలందిస్తున్న ఆరోగ్య సిబ్బంది సేవలను ఆయన అభినందించారు. అలాగే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన మొబైల్ పోలియో కేంద్రాలను ప్రయాణికులు కూడా వినియోగించుకోవాలని సూచించారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి పల్లె, పట్టణంలో ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానికంగా చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు