ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సంగారెడ్డి: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరును నిరసిస్తూ సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంగారెడ్డి పట్టణంలో నిరసన చేపట్టాయి. రామ్‌నగర్‌లోని జగ్గారెడ్డి నివాసం నుంచి పాతబస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అరాచకానికి పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులపై దాడి చేసి, తిరిగి తామే బాధితులమన్నట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. దళితులను అవమానించేలా బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు, చర్యలు రాష్ట్ర ప్రజలంతా గమనించారని అన్నారు.దళితులు నడిచిన నేలను పసుపునీళ్లతో శుద్ధి చేయడం బీఆర్ఎస్ కుసంస్కారానికి, అనాగరిక వైఖరికి నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడాన్ని జీర్ణించుకోలేకే బీఆర్ఎస్ అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు. దళితులను అవమానించే వైఖరిని కొనసాగిస్తే బీఆర్ఎస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నిర్మల జగ్గారెడ్డి హెచ్చరించారు.
Admin
ప్రజా పిలుపు