ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజల సహకారం, సమష్టి కృషితో పటాన్‌చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, సంక్షేమ సంఘాల కార్యాలయాలతో పాటు మైత్రి మైదానంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన మార్చ్‌ఫాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పటాన్‌చెరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ‘మినీ ఇండియా’గా పేరొందిన పటాన్‌చెరులో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించే లక్ష్యంతో పటాన్‌చెరులో ప్రాథమిక పాఠశాల నుంచి పీజీ కళాశాల వరకు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో విద్య అందుబాటులో ఉందన్నారు. పాలిటెక్నిక్ కళాశాల కూడా విద్యార్థులకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకోవాలని సూచించారు.విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులు స్థానిక స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి దేశానికి, రాష్ట్రానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.పటాన్‌చెరు పట్టణానికి చెందిన నర్రా వీరస్వామి ఇటీవల శ్రీలంకలో జరిగిన బాడ్మింటన్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రూ.50 వేల ప్రోత్సాహక బహుమతిని అందజేసి అభినందించారు.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మార్చ్‌ఫాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన పాఠశాలలకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో మొత్తం రూ.3.80 లక్షల నగదు బహుమతులను అందజేశారు. యువజన వికాస సమితి ఆధ్వర్యంలో 80 అడుగుల జాతీయ జెండాతో నిర్వహించిన ప్రత్యేక పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రథమ బహుమతి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ద్వితీయ బహుమతి మంజీరా హైస్కూల్, తృతీయ బహుమతి కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు లభించాయి. ప్రథమ బహుమతి శాంతినికేతన్ ఉన్నత పాఠశాల, ద్వితీయ బహుమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పటాన్‌చెరు, తృతీయ బహుమతి కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు లభించాయి.స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, క్రీడాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు