ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్ చేరు :విద్యార్థులు, యువత చట్టపరిధిలోనే వ్యవహరించాలని, ఎలాంటి ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నా ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని పటాన్‌చెరు ఏసీపీ శ్రీనివాస్ కుమార్ సూచించారు. అనుమతి లేకుండా నిర్వహించే ఆందోళనల వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.పటాన్‌చెరు ప్రాంతంలోని పాలిటెక్నిక్ విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ జీవితాన్ని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి విషయంలోనూ నిబంధనలను పాటించాలని సూచించారు. సమస్యలు ఉంటే పోలీసులపై నమ్మకం ఉంచి, చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కారం కోసం ప్రయత్నించాలని తెలిపారు.సెప్టెంబర్ 8న జరిగిన నిరసన కార్యక్రమం సందర్భంగా విద్యార్థులతో పాటు సామాన్య ప్రజలు కూడా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన పేర్కొన్నారు. అనుమతులు లేకుండా చేపట్టే ఆందోళనల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని వివరించారు.పోలీసు కేసులు విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఏసీపీ హెచ్చరించారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లాలనుకున్న వ్యక్తి పోలీసు కేసు కారణంగా తన అవకాశాన్ని కోల్పోయిన ఘటనను ఉదాహరణగా పేర్కొన్నారు. భవిష్యత్తులో మంచి విద్యా, ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు పోలీసు కేసులు అడ్డంకిగా మారే అవకాశం ఉందన్నారు.ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయంలోనూ పోలీసు కేసులు సమస్యగా మారే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల విద్యార్థులు భావోద్వేగాలకు లోనుకాకుండా చట్టపరిధిలో తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించాల్సి వస్తే ముందుగానే పోలీసులను సంప్రదించి అవసరమైన అనుమతులు తీసుకోవాలని ఏసీపీ శ్రీనివాస్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని, చిన్నపాటి తప్పిదాల కారణంగా విలువైన అవకాశాలను కోల్పోవద్దని ఆయన హితవు పలికారు.
Admin
ప్రజా పిలుపు