ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలన, ఎన్‌డీపీఎస్ కేసుల దర్యాప్తులో పురోగతి, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఈగల్ ఫోర్స్ ఎస్పీ రఘువీర్ సోమవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈగల్ ఫోర్స్ ఎస్పీ రఘువీర్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి డ్రగ్స్ నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలు, ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటు చేసి విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని అన్నారు. విద్యార్థులు డ్రగ్స్‌కు బానిస కాకుండా ముందస్తు చర్యలు చేపట్టి విద్యాసంస్థలను డ్రగ్స్ రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు.వాణిజ్య పరిమాణానికి మించిన మాదక ద్రవ్యాల కేసుల్లో నిందితుల ఆస్తుల జప్తుకు చట్టపరమైన నిబంధనల ప్రకారం సిఫారసు చేయాలని అధికారులకు సూచించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న, డ్రగ్స్‌కు అలవాటుపడిన నేరస్తులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు హిస్టరీ షీట్లు తెరవాలని ఆదేశించారు.పోలీస్ అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని, తెలంగాణ పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన వివిధ సాంకేతిక అప్లికేషన్లు, వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించుకుని మాదక ద్రవ్యాల కేసులను ఛేదించాలని సూచించారు. కేసుల దర్యాప్తులో సాంకేతిక ఆధారాలను సమర్థవంతంగా సేకరించి, నిందితులకు శిక్ష పడేలా నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని అన్నారు.అనంతరం జిల్లాలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఎలాంటి పెండింగ్ లేకుండా 1,485 కిలోల గంజాయి, 5 కిలోల ఆల్ప్రాజోలం డిస్పోజల్ ప్రక్రియను పూర్తి చేసినందుకు సంగారెడ్డి జిల్లా పోలీస్ అధికారులను ఎస్పీ రఘువీర్ అభినందించారు. ఇదే విధమైన సమర్థవంతమైన చర్యలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తూ సంగారెడ్డి జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, ఐపీఎస్, ఈగల్ ఫోర్స్ డీఎస్పీ పుష్పన్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ రామ్‌నాయక్, డీఎస్పీలు సత్యయ్యగౌడ్, సైదానాయక్, వెంకట్‌రెడ్డి, ప్రభాకర్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ రమేష్, ఎస్-న్యాబ్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు