ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : వట్టిపల్లి మండల పరిధిలోని నాగులపల్లి గ్రామంలో ఆశా వర్కర్‌గా పనిచేసిన మహిళ మృతి చెందడం బాధాకరమని సీఐటీయూ వట్టిపల్లి మండల కార్యదర్శి కామ్రేడ్ ఎర్రోళ్ల మహేష్ అన్నారు. మృతురాలి కుటుంబంలో అర్హులైన ఒకరికి ఆశా వర్కర్‌గా లేదా స్థానిక పీహెచ్‌సీలో ఉద్యోగ అవకాశం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఎర్రోళ్ల మహేష్ మాట్లాడుతూ.. మృతురాలు గత కొంతకాలంగా ఆశా వర్కర్‌గా గ్రామంలో అంకితభావంతో పనిచేశారని తెలిపారు. కరోనా సమయంలోనూ, గర్భిణీల సేవల్లోనూ, ఇంటింటి సర్వేల్లోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారని పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం పగలు, రాత్రి కష్టపడి పనిచేసిన ఆశా వర్కర్‌ను కోల్పోవడం బాధాకరమన్నారు.మృతురాలికి రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే కుటుంబ సభ్యులకు చెల్లించాలని, ఆశా వర్కర్లకు వర్తించే ప్రమాద బీమా మొత్తాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల నష్టపరిహారం అందించాలని కోరారు.గ్రామీణ వైద్య వ్యవస్థలో ఆశా వర్కర్లు కీలకంగా పనిచేస్తున్నారని, అలాంటి వారికి ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఈఎస్ఐ, పీఎఫ్, హెల్త్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు ఎర్రోళ్ల మహేష్ తెలిపారు.
Admin
ప్రజా పిలుపు