ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : నర్సాపూర్ పట్టణంలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలో ఒంటరిగా ఏడుస్తున్న రెండేళ్ల తొమ్మిది నెలల చిన్నారిని నర్సాపూర్ పోలీసులు కేవలం రెండు గంటల్లోనే గుర్తించి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.స్థానికుల నుంచి సమాచారం అందుకున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది మోహన్, సతీష్ చిన్నారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అక్కడ మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు శోభ, కవిత చిన్నారికి ఆహారం అందించి జాగ్రత్తగా చూసుకున్నారు. ఎస్ హెచ్ ఓ ఏ. రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బృందం చిన్నారి కనిపించిన ప్రాంతంలో దాదాపు రెండు గంటల పాటు ఇంటింటికీ వెళ్లి విచారణ చేపట్టింది. విచారణలో చిన్నారి పేరు ఆర్యన్ అని, తల్లిదండ్రులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రామ్ గణేష్, రాణి దంపతులని, ప్రస్తుతం శ్రీరామ్‌నగర్‌లో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు.రామ్ గణేష్ మేస్త్రీ పనికి వెళ్లే సమయంలో చిన్నారిని 200 మీటర్ల దూరంలో నివసించే అత్త రాం కళీ వద్ద ఉంచినట్లు తెలిపారు. అయితే చిన్నారి బయటకు వెళ్లి తప్పిపోయినట్లు తల్లిదండ్రులు పోలీసులకు వివరించారు. వివరాలు, ఆధారాలను నిర్ధారించిన అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.త్వరితగతిన స్పందించి చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించడంలో చురుకుగా వ్యవహరించిన సిబ్బంది మోహన్, సతీష్, కవిత, శోభలను ఎస్‌హెచ్‌ఓ రంజిత్ కుమార్ అభినందించారు. తమ బిడ్డను క్షేమంగా అప్పగించినందుకు తల్లిదండ్రులు నర్సాపూర్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
Admin
ప్రజా పిలుపు