ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో పరారీలో ఉన్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన నిందితుడిని పటాన్‌చెరు ఎక్సైజ్ ప్రత్యేక బృందం అరెస్టు చేసింది. రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో నిందితుడిని పట్టుకోవడం విశేషం.పటాన్‌చెరు నిషేధ, ఆబ్కారీ శాఖ పోలీస్‌స్టేషన్‌లో గత ఆగస్టు 11న హెరాయిన్ (బ్రౌన్ షుగర్)కు సంబంధించి మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు ఈ నెల 25న ఎన్‌ఫోర్స్‌మెంట్ సంచాలకుడు అవినాష్ మహంతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా ప్రాంతానికి పంపించారు.సైబరాబాద్ ఉప కమిషనర్ హరికిషన్, జిల్లా నిషేధ, ఆబ్కారీ శాఖ అధికారి వై. రాధాకృష్ణారెడ్డి, పటాన్‌చెరు ఆబ్కారీ వలయ ఇన్‌స్పెక్టర్ ఆర్. శ్రవణ్‌కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టింది. ఆబ్కారీ శాఖ సహాయ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి సాయిరాం, నిషేధ, ఆబ్కారీ ఉప పరిశీలకుడు ఫయాజ్, సిబ్బంది నెహ్రూ, రవికిరణ్, సంజయ్‌లతో కూడిన బృందం స్థానిక పోలీసుల సహకారంతో నిందితుడిని గుర్తించి పట్టుకుంది.అనంతరం చట్టపరమైన ప్రక్రియలో భాగంగా నిందితుడిని ప్రయాణ మధ్యంతర న్యాయ అనుమతితో సంబంధిత న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఆదివారం (నవంబర్ 1) పటాన్‌చెరు ఆబ్కారీ శాఖ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి సంగారెడ్డి న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు న్యాయ నిర్బంధానికి తరలించారు.మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఈ తరహా కేసుల్లో పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నట్లు ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌కు సహకరించిన పశ్చిమ బెంగాల్ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన ప్రత్యేక బృంద సభ్యులను అభినందించారు.
Admin
ప్రజా పిలుపు