ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని తెల్లాపూర్ డివిజన్‌లో రూ.21 కోట్ల అంచనా వ్యయంతో రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) మంజూరు చేయించినట్లు మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. బుధవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ్‌ను కలిసి ఆర్‌యూబీ మంజూరుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రైల్వే సమస్యలు, కొత్త ప్రతిపాదనలపై జీఎంతో చర్చించారు.ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ పరిధిలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా తెల్లాపూర్, భెల్ ప్రాంతాల ప్రజలు సుదీర్ఘకాలంగా కోరుతున్న రోడ్ అండర్ బ్రిడ్జిని మంజూరు చేయించినట్లు చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. శనివారం రైల్వే అధికారులు, ఇతర శాఖల అధికారులతో కలిసి నిర్మాణ స్థలాన్ని పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్థల పరిశీలనకు హాజరు కావాలని కోరారు.తెల్లాపూర్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు ఫుట్‌ఓవర్ బ్రిడ్జిని కూడా మంజూరు చేయించినట్లు ఎంపీ తెలిపారు. ఈ నెలాఖరులోగా పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆర్‌యూబీ, ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలతో తెల్లాపూర్, భెల్ ప్రాంతాల ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న రవాణా సమస్యలు పరిష్కారం కానున్నాయని అన్నారు.లింగంపల్లి వరకు నడుస్తున్న ప్రతి ఎంఎంటీఎస్ రైలును రామచంద్రాపురం వైపు, మరోవైపు నాగులపల్లి వరకు పొడిగించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎంను కోరినట్లు రఘునందన్‌రావు తెలిపారు. పశ్చిమ హైదరాబాద్‌లో జనావాసాలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ఎంఎంటీఎస్ సేవల విస్తరణే కీలక మార్గమని అన్నారు. అయితే ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉంటుందని రైల్వే జీఎం తెలిపారని ఎంపీ పేర్కొన్నారు.ఎంఎంటీఎస్ విస్తరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని రైల్వేకు ప్రతిపాదనలు పంపాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.
Admin
ప్రజా పిలుపు