ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన నిర్ణయాన్ని హైకోర్టు పక్కనపెట్టింది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బి-ఫామ్‌పై సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని ప్రస్తావిస్తూ ఆయనపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లు దాఖలయ్యాయి.ఈ పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ తిరస్కరించడంతో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అంశాన్ని వారు ప్రధానంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం దానం నాగేందర్‌పై అనర్హత వేటు విధించింది. కోర్టు తీర్పు ప్రకారం ఆయన అనర్హత 2024 ఏప్రిల్ 23 నుంచి అమల్లోకి వస్తుంది.హైకోర్టు తీర్పుతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి తదుపరి న్యాయ, ఎన్నికల ప్రక్రియపై ఆసక్తి నెలకొంది. ఈ తీర్పు పార్టీ ఫిరాయింపుల అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లపైనా ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.
Admin
ప్రజా పిలుపు