ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సంగారెడ్డి: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం నిర్వహించిన 'ఓట్ చోరీ' వ్యతిరేక బహిరంగ సభ ప్రత్యక్ష ప్రసారాన్ని సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం సమీపంలో భారీ ఎల్‌ఈడీ తెరలపై ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ర్యాలీ, బహిరంగ సభ ప్రసంగాలను వీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోందని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఓటు హక్కును పరిరక్షించేందుకు రాహుల్ గాంధీ నిరంతరం పోరాడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో రాహుల్ గాంధీ చేపట్టిన పోరాటానికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అండగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ పోరాటంలో తామంతా రాహుల్ గాంధీ సైనికులమని స్పష్టం చేశారు.దేశ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలంటే ఇందిరమ్మ పాలన మళ్లీ రావాలని జగ్గారెడ్డి ఆకాంక్షించారు. పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చే పాలన రావాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నది తమ ఆకాంక్ష అని తెలిపారు. ఆ లక్ష్యం నెరవేరే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించకుండా ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలను ప్రజలు మరువరని పేర్కొన్న జగ్గారెడ్డి, దేశ ప్రజల హక్కులు, సంక్షేమం కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని అన్నారు. తన భార్య నిర్మలతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ సభకు హాజరయ్యారని, తాను సంగారెడ్డిలో ప్రజలు, కార్యకర్తలతో కలిసి సభ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించానని తెలిపారు.
Admin
ప్రజా పిలుపు