ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : : పోక్సో, అత్యాచార కేసుల్లో మహిళలు, చిన్నారుల రక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి బాధితులకు సమగ్ర సేవలు అందించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం డీజీపీ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా భరోసా సెంటర్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా స్థాయి స్టేక్‌హోల్డర్స్ కన్వర్జెన్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో బాధితులకు అన్ని రకాల సేవలను ఒకే వేదికపై అందించాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులు మళ్లీ మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా రీ-విక్టిమైజేషన్ జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రామా హీలింగ్, కౌన్సెలింగ్, పునరావాస సేవలు సమర్థవంతంగా అందించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. పోక్సో, అత్యాచార కేసుల బాధితులకు వివిధ శాఖల సేవలు మరింత సమర్థవంతంగా చేరేలా పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.సమావేశంలో భరోసా సెంటర్‌లో మెడికల్ ఆఫీసర్ నియామకం అవసరం, వైద్య పరీక్షల నివేదికల నాణ్యత మెరుగుదల, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలను భరోసా సెంటర్‌లో నిర్వహించే ప్రతిపాదన, విక్టిమ్ కాంపెన్సేషన్ పెండింగ్ కేసుల పురోగతి వంటి అంశాలపై చర్చించారు. అలాగే చదువు మధ్యలో మానేసిన బాధిత బాలికలకు ఎలాంటి వివక్ష లేకుండా తిరిగి పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలు కల్పించడం, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, పోక్సో చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి కీలక అంశాలను సమీక్షించారు.అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్ మాట్లాడుతూ పోక్సో, అత్యాచార కేసుల్లో మహిళలు, చిన్నారుల రక్షణలో ప్రతి శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పరస్పర సమన్వయంతో పనిచేస్తే బాధితులకు త్వరితగతిన న్యాయం, వైద్య సహాయం, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, పునరావాస సేవలు సమర్థవంతంగా అందించవచ్చని తెలిపారు.ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ శాఖల ప్రతినిధులు తమ శాఖల ద్వారా అందిస్తున్న సేవలను వివరించి, పోక్సో, అత్యాచార కేసుల బాధితులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే బాధితులకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించవచ్చని అభిప్రాయపడ్డారు.ఈ సమావేశంలో డీఎల్‌ఎస్‌ఏ సౌజన్య, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. లలిత కుమారి, వైద్య అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ రాజారెడ్డి, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సూర్‌రెడ్డి, సత్యనారాయణ, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ జ్యోతి, డీఎస్పీలు వెంకట్‌రెడ్డి, ప్రభాకర్, భరోసా సెంటర్ కో-ఆర్డినేటర్ పి. దేవలక్ష్మి, భరోసా సెంటర్ సిబ్బంది, పోలీసు అధికారులు, ఇతర లైన్ డిపార్ట్‌మెంట్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు
Admin
ప్రజా పిలుపు