ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : హైదరాబాద్, సెప్టెంబర్ 7: గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని కళ్యాణి మల్లాది రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొందేందుకు అర్హత సాధించారు. ‘కొత్త పైరిమిడిన్ ఆధారిత కార్బోసైక్లిక్ న్యూక్లియోసైడ్, ఫ్యూజ్డ్ హెటెరోసైక్లిక్ ఉత్పన్నాలు: సంశ్లేషణ, ఇన్-సిలికో, మధుమేహ నిరోధక, సూక్ష్మక్రిమి నిరోధక మూల్యాంకనం’ అనే అంశంపై ఆమె పరిశోధన నిర్వహించి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల మార్గదర్శకత్వం వహించారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన కళ్యాణి మల్లాది పీహెచ్‌డీకి అర్హత సాధించిన విషయాన్ని వెల్లడించారు.మధుమేహ నిరోధక, సూక్ష్మజీవ నిరోధక అనువర్తనాలకు ఉపయోగపడే అవకాశమున్న నూతన పైరిమిడిన్ ఆధారిత సమ్మేళనాల అభివృద్ధిని ఈ పరిశోధనలో అన్వేషించినట్లు ప్రొఫెసర్ రాంబాబు తెలిపారు. అధ్యయనంలో భాగంగా పలు ఆశాజనకమైన ఆల్ఫా-గ్లూకోసిడేస్ నిరోధకాలను గుర్తించినట్లు వివరించారు. ఎంపిక చేసిన కొన్ని సమ్మేళనాలు బలమైన నిరోధక చర్యతో పాటు అనుకూలమైన మాలిక్యులర్ డాకింగ్ లక్షణాలను, గణనీయమైన యాంటీ బ్యాక్టీరియల్ చర్యను ప్రదర్శించినట్లు పేర్కొన్నారు.అలాగే ఆయా సమ్మేళనాలు ఔషధంగా ఉపయోగపడే సామర్థ్యం, శరీరంలో శోషణ–వినియోగం–విసర్జనకు సంబంధించిన ఏబీఎంఈ లక్షణాలు, విషపూరిత ప్రభావాలకు సంబంధించిన అంశాల్లోనూ ఆశాజనకమైన ఫలితాలను చూపించినట్లు తెలిపారు. మధుమేహం, సూక్ష్మజీవుల సంక్రమణలకు సురక్షితమైన, మరింత ప్రభావవంతమైన చికిత్సా అభ్యర్థుల అన్వేషణకు ఈ పరిశోధన దోహదపడుతుందని వివరించారు.కళ్యాణి మల్లాది పీహెచ్‌డీ పట్టాకు అర్హత సాధించినందుకు గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం. రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది ఆమెను అభినందించారు.పరిశోధన మొత్తం కాలంలో అంకితభావంతో మార్గనిర్దేశనం చేసి, విలువైన సూచనలు అందించిన ప్రొఫెసర్ రాంబాబు గుండ్లను కూడా వారు అభినందించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
Admin
ప్రజా పిలుపు