ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : నర్సాపూర్ మండల పరిధిలోని ఓ గ్రామంలో తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ కోసం ఏర్పాటు చేసిన వైర్ ఓ కుటుంబానికి ప్రాణాపాయంగా మారిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. విద్యుత్ వైర్‌ను ప్రమాదకరంగా ఏర్పాటు చేయడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఇది నిర్లక్ష్యమా.. ఉద్దేశపూర్వక చర్యనా అనే కోణంలో విచారణ జరపాలని కోరుతున్నారు.గ్రామంలోని ఓ నివాస సముదాయం ముందు ఉన్న ఇనుప షెడ్డు మీదుగా తాత్కాలిక విద్యుత్ సరఫరా కోసం వైర్ ఏర్పాటు చేశారు. అయితే, వైర్ జాయింట్‌కు కనీసం ఇన్సులేషన్ టేప్ కూడా చుట్టకుండా, విద్యుత్ వైర్ నేరుగా ఇనుప షెడ్డుకు ఆనుకునేలా వదిలేసినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో తరచూ కోతులు సంచరిస్తుండటంతో వైర్ తెగినా, కదిలినా లేదా ఇనుప షెడ్డుకు తగిలినా షెడ్డు విద్యుదీకరణకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షెడ్డును తాకిన వారికి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన ఇంటి యజమాని విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపడుతుండగా, పక్కింటికి చెందిన వ్యక్తి అక్కడికి వచ్చి వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. విచారణలో సదరు విద్యుత్ వైర్‌ను ఆ వ్యక్తే ఏర్పాటు చేసినట్లు తెలిసిందని స్థానికులు చెబుతున్నారు.షెడ్డు వద్ద నివసించే వ్యక్తికి, పక్కింటి వ్యక్తికి మధ్య గతంలో కక్షలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే వైర్‌ను ప్రమాదకరంగా వదిలేశారనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.విద్యుత్ వైర్ వల్ల ప్రమాదం జరిగి ఉంటే ఓ కుటుంబం ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఇరువర్గాల మధ్య సర్దుబాటు జరిగినట్లు సమాచారం. అయినప్పటికీ, ఘటన వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.విద్యుత్ వైర్ల ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, ఉద్దేశపూర్వకంగా ప్రమాదానికి కారణమయ్యారా అనే అంశంపై సంబంధిత అధికారులు, పోలీసులు విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Admin
ప్రజా పిలుపు