ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజా పిలుపు జూన్ 26 సంగారెడ్డి జిల్లా:కేంద్ర ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఉన్న పరిమితులను తొలగించిన నేపథ్యంలో, హోటళ్లు, భోజనశాలలు, అల్పాహార కేంద్రాల యాజమాన్యాలు గతంలో గ్యాస్ సిలిండర్ల కొరత, అధిక ధరలను సాకుగా చూపుతూ పెంచిన ఆహార పదార్థాల ధరలను వెంటనే తగ్గించాలని నవభారత్ నిర్మాణ్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు. గ్యాస్ సిలిండర్ల కొరత ఉన్న సమయంలో వినియోగదారులపై అదనపు భారం మోపుతూ అల్పాహారాలు, భోజనాలు, ఇతర ఆహార పదార్థాల ధరలను పెంచిన హోటళ్లు, ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ అదే అధిక ధరలను కొనసాగించడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు.ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని హోటల్ యాజమాన్యాలు సామాజిక బాధ్యతతో వ్యవహరించి ఆహార పదార్థాల ధరలను తగ్గించాలని ఆయన కోరారు.అదేవిధంగా, రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు హోటళ్లు, భోజనశాలల్లో ఆహార ధరలపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించి, ప్రజలకు న్యాయమైన ధరలకు నాణ్యమైన ఆహారం అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని మెట్టు శ్రీధర్ విజ్ఞప్తి చేశారు.
Admin
ప్రజా పిలుపు