ప్రజా పిలుపు / తెలంగాణ / వనపర్తి : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, నిరుద్యోగ నిర్మూలన కోసం పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం.డి. కుతుబ్ పిలుపునిచ్చారు. బుధవారం అమరచింత మండల కేంద్రంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభల గోడపత్రికలను ఆయన విడుదల చేశారు.ఈ సందర్భంగా కుతుబ్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. యువతలో ప్రగతిశీల, అభ్యుదయ భావాలు, దేశభక్తి, లౌకిక, ప్రజాస్వామ్య ఆలోచనలను పెంపొందించేందుకు ఏఐవైఎఫ్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. 1959 మే 3న ఆవిర్భవించిన ఏఐవైఎఫ్ నిరుద్యోగ నిర్మూలన, 18 ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు, ఉద్యోగాలు, ఉపాధి కోసం అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు.ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత మద్యం, సిగరెట్లు, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినా, ఆ హామీ అమలు కాలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.3 వేల నిరుద్యోగ భృతికి కూడా దిక్కులేకుండా పోయిందన్నారు.సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో యాదగిరిగుట్టలో ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభల ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పించే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు, ధర్నాలు, ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని కుతుబ్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి మైబు, శ్రీకాంత్, కుమార్, రాము తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు