ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చేరు నియోజకవర్గ పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీ చిన్న కంజర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగ సంబరాలను రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఘనంగా నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చేరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్‌తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇంటి కుటుంబ సభ్యులతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొని ఆత్మీయంగా గడిపారు. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, నిరుపేదలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కాటా శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ప్రజల అవసరాలు, సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో పనిచేస్తున్నారని తెలిపారు.1970వ దశకంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నాయకత్వంలో పేదలకు అసైన్‌మెంట్ భూముల పంపిణీతో పాటు ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. అదేవిధంగా 2012లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు. గత పదేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అర్హులైన పేదలందరికీ ఇళ్లు అందించడంలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారని విమర్శించారు. రాష్ట్రాన్ని సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల భారంలోకి నెట్టారని ఆరోపించారు.ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఏ పేద కుటుంబం కూడా గుడిసెలు, పెంకుటిళ్లలో నివసించకూడదనే సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే రెండు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని, మరో రెండు లక్షల ఇళ్లను నిర్మించి పేదలకు అందించనున్నామని వివరించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.అదేవిధంగా పేద కుటుంబాలకు నాణ్యమైన సన్నబియ్యం అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కేంద్రీకృత వంటశాలల ద్వారా విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల ఆహార నాణ్యత, పరిమాణంలో ప్రమాణాలు పాటించే అవకాశం ఉంటుందన్నారు.విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఒక్కో పాఠశాలలో సుమారు 2,000 మంది విద్యార్థులు చదువుకునేలా ఆధునిక సదుపాయాలు, విద్యతో పాటు వివిధ కార్యకలాపాలకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు చెప్పారు. దీనివల్ల విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలతో పాటు క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయన్నారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని, అధిక వైద్య ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రానికి పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇచ్చి యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 10 వేల మంది ఉపాధ్యాయులను నియమించిందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన భోజనం, అర్హత కలిగిన ఉపాధ్యాయులు, ఆధునిక విద్యా సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి భోజనం చేసే కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈశ్వరమ్మ తన ఇంట్లో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయంగా భోజనం చేయడం ద్వారా ప్రభుత్వం పేద కుటుంబాలకు మరింత చేరువవుతుందని చెప్పారు. ప్రజల ఇళ్లకు వెళ్లి వారితో కలిసి భోజనం చేయాలనే ముఖ్యమంత్రి ఆలోచన ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం, భరోసా పెంచుతుందన్నారు.అలాగే స్థానికంగా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి ఏవైనా సమస్యలు, అభివృద్ధి పనుల అవసరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, మున్సిపల్ కౌన్సిలర్ ,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపావళి సంబరాలు, ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను విజయవంతం చేశారు.
Admin
ప్రజా పిలుపు