ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వినాయక శోభాయాత్రలు, నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ తెలిపారు. నిమజ్జనాలు జరగనున్న సంగారెడ్డి మహబూబ్ సాగర్, సదాశివపేట ఊబ చెరువులను ఆయన సందర్శించి భద్రతా, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.నిమజ్జన కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సజావుగా జరిగేలా అవసరమైన లైటింగ్, క్రేన్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు ఎస్పీ సూచించారు. గణేష్ శోభాయాత్రలు జరిగే మార్గాల్లో రోడ్ల పరిస్థితి, అవసరమైన మరమ్మతులు, నిమజ్జన ప్రాంతాల్లో బారికేడింగ్, భద్రతా లైటింగ్, పారిశుద్ధ్య ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.జిల్లా ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ కూన సంతోష్, వివిధ శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు