ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : * జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలను జిన్నారం జూనియర్ సివిల్ జడ్జి పి.తేజశ్రీ ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం విద్యార్థినులతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి రాజ్యాంగ హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా న్యాయమూర్తి పి.తేజశ్రీ మాట్లాడుతూ విద్యార్థులు భారత రాజ్యాంగం, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. చట్టాలను గౌరవిస్తూ దేశ సమగ్రతకు పాటుపడాలని, పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా అంకితభావంతో విద్యను అభ్యసించాలని సూచించారు.సోషల్ మీడియాలో అపరిచితులతో అనవసరంగా చాటింగ్ చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు.ర్యాగింగ్‌కు పాల్పడవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.జిన్నారం ఎస్‌ఐ హనుమంతు, లీగల్ సర్వీసెస్ న్యాయవాది బి.బాలకిషన్ మాట్లాడుతూ విద్యార్థులు దేశ నాయకులను స్ఫూర్తిగా తీసుకుని అంకితభావంతో చదివి తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. చెడు మార్గాలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు