ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆగస్టు 15న తెల్లవారుజామున 12.గంటల సమయంలో కేతావత్ శ్రీను అనే వ్యక్తి 112కు ఫోన్ చేసి పటాన్‌చెరు బస్టాండ్ ఎదురుగా ఇస్నాపూర్ నుంచి లింగంపల్లి వైపు వెళ్లే జాతీయ రహదారి-65పై గుర్తుతెలియని వ్యక్తిని గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొట్టినట్లు సమాచారం అందించాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, సుమారు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్నాడు. అతను తన వివరాలు చెప్పే పరిస్థితిలో లేకపోవడంతో గుర్తింపు సాధ్యం కాలేదు. గాయపడిన వ్యక్తిని 108 అంబులెన్స్‌లో పటాన్‌చెరు ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ ఆగస్టు 15న తెల్లవారుజామున 4.35 గంటలకు మృతి చెందినట్లు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పోలీసులకు సమాచారం అందింది. మృతుడి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని ద్విచక్ర వాహనం, దాని డ్రైవర్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
Admin
ప్రజా పిలుపు