ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : గుమ్మడిదల, సెప్టెంబర్ 5: రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేయడం సరికాదని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తక్షణమే 22ఏ నిషేధాన్ని ఎత్తివేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గుమ్మడిదలలో నిర్వహించిన రైతన్న పోరుబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని, ప్రస్తుత ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.జిన్నారం, గుమ్మడిదలతో పాటు పటాన్‌చెరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ భూములను 22ఏ జాబితాలో చేర్చడంతో రైతులు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ముఖ్యమంత్రి ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.రైతులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, వారి హక్కుల కోసం బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు