ప్రజా పిలుపు / తెలంగాణ / ఖమ్మం : ఢిల్లీ: ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కుల సంరక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన భారీ ర్యాలీలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపారు.బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడుతోందంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను కాపాడాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ర్యాలీలో నాయకులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను, పౌరుల ఓటు హక్కును పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ఈ ర్యాలీలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌తో పాటు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్, సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు సందీప్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాతీయ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఓటు హక్కులపై వస్తున్న ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.రాహుల్ గాంధీ నాయకత్వంలో కొనసాగుతున్న ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటానికి మద్దతుగా ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడం ద్వారా ఓటు హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
Admin
ప్రజా పిలుపు