ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధరణి, భూ రికార్డులు, 22-ఏ నిషేధిత జాబితా తదితర అంశాలపై వారు మాట్లాడారు. ధరణి వ్యవస్థ ద్వారా భూ సమస్యలు పరిష్కారమయ్యాయని గత ప్రభుత్వం చెప్పినప్పటికీ, భూ హక్కులు, రికార్డుల మార్పులు, నిషేధిత జాబితా తదితర అంశాల్లో అనేక సమస్యలు కొనసాగాయని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ధరణి వ్యవస్థలో తలెత్తిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సమగ్ర పరిశీలన అవసరమని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోందన్నారు.కేటీఆర్, హరీశ్‌రావు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, తమ వద్ద ఉన్న భూముల వివరాలను పూర్తిగా ప్రజల ముందుంచాలని సవాల్ చేశారు. భూములపై నిజమైన చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, ఆరోపణలు, ప్రత్యారోపణలకు బదులుగా అధికారిక రికార్డులు, లెక్కల ఆధారంగా వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు. గతంలో పరిమిత భూములు మాత్రమే ఉన్నాయని చేసిన ప్రకటనల నేపథ్యంలో ప్రస్తుతం వస్తున్న భూ ఆరోపణలు, వివరాలపై కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.భూ వ్యవహారాలపై శాసనసభ వేదికగా సమగ్ర చర్చ జరగాలని వారు కోరారు. గత పాలనలో జరిగిన పరిణామాలు, ధరణి వ్యవస్థలో తలెత్తిన సమస్యలు, ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పూర్తిస్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. “చర్చకు మేము సిద్ధం.. నిజాలు చెప్పడానికి మేము సిద్ధం.. ప్రజలకు వాస్తవాలు తెలియాలి” అని స్పష్టం చేశారు.భూ సమస్యల పరిష్కారానికి ప్రస్తుత ప్రభుత్వం భూ భారతి ద్వారా భూ పరిపాలనలో సంస్కరణలు చేపడుతోందని తెలిపారు. 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న నిజమైన హక్కుదారుల భూముల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో హక్కుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. అవసరమైన చోట సర్వే నంబర్లకు బై-నంబర్లు కేటాయించి హక్కుదారుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం వెల్లడించినట్లు తెలిపారు.ప్రతి ఎకరా కాపాడాలి.. ప్రతి హక్కుదారుడికి న్యాయం జరగాలి. పేదల ఒక్క ఆస్తిని కూడా అన్యాయంగా కోల్పోనివ్వం” అని కాంగ్రెస్ నేతలు అన్నారు. నిషేధిత జాబితాలోని అంశాలను లోతుగా పరిశీలించి, భూ సమస్యలకు న్యాయబద్ధమైన, శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.భూములపై ఎవరి వద్ద ఎలాంటి వివరాలు ఉన్నాయో వాటిని ప్రజల ముందుంచి, అధికారిక రికార్డుల ఆధారంగా చర్చ జరగాలని వారు కోరారు. ప్రజలను తప్పుదోవ పట్టించే మాటల కంటే రికార్డులు, లెక్కలు, వాస్తవాలే ముఖ్యమన్నారు. భూ హక్కుల పరిరక్షణ, నిషేధిత జాబితా సమస్యల పరిష్కారం, నిజమైన హక్కుదారులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు