ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జిల్లాలో వివిధ రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను వంద శాతం సాధించేలా బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని అదనపు కలెక్టర్ పాండు సూచించారు.మంగళవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్‌లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 2026 మాసాంతానికి పంట రుణాలు, వ్యవసాయ, ప్రాధాన్యతా రంగాలకు సంబంధించి బ్యాంకుల వారీగా నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిని అదనపు కలెక్టర్ సమీక్షించారు.పంట రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు అన్ని బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. కొన్ని బ్యాంకులు లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు అందిస్తున్నప్పటికీ, మరికొన్ని బ్యాంకులు ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించడం లేదన్నారు. బ్యాంకుల పనితీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తూ, తదుపరి సమావేశం నాటికి వంద శాతం లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వ్యవసాయ శాఖతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర సంక్షేమ శాఖలతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ పథకాల కింద ఎంపికైన అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. తద్వారా వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. రుణాలు పొందిన లబ్ధిదారులు యూనిట్లను ఏర్పాటు చేశారా లేదా అనే విషయాన్ని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు.స్వయం సహాయక సంఘాలకు పూర్తి స్థాయిలో బ్యాంకు లింకేజీ రుణాలు అందించాలని, సబ్సిడీ రుణాల మంజూరులో ఎలాంటి జాప్యం చేయవద్దని బ్యాంకర్లకు సూచించారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారులకు రుణాలు అందించేందుకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా బ్యాంకులకు అందిన రుణ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, అర్హత ఉన్న దరఖాస్తులను వెంటనే మంజూరు చేయాలని ఆదేశించారు.ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందేలా చూడాలని అదనపు కలెక్టర్ పాండు సూచించారు.ఈ సందర్భంగా ఎల్‌డీఎం సుధీర్ కుమార్ మాట్లాడుతూ, జూన్ 2026 మాసాంతానికి జిల్లాలో క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 196.40 శాతంగా నమోదైందని తెలిపారు. జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, నాబార్డ్ ఏజీఎం కృష్ణ తేజ, పరిశ్రమల శాఖ జీఎం తుల్జా నాయక్, ఆర్‌బీఐ రీజినల్ మేనేజర్, మెప్మా అధికారులు, వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు