ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : :పటాన్‌చెరు నియోజకవర్గంలోని జేపీ కాలనీ డివిజన్ పరిధిలో బండ్లగూడలో ఎంపీ రఘునందన్ రావు గురువారం పర్యటించి రైల్వే భూములు, పటాన్‌చెరు రైల్వే స్టేషన్‌తో పాటు పాత ఈఎస్‌ఐ క్లినిక్ స్థలాన్ని సందర్శించారు.జేపీ కాలనీ డివిజన్ పరిధిలో రైల్వే స్థలంలో ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న పేదల విజ్ఞప్తి మేరకు ఎంపీ బండ్లగూడకు చేరుకుని పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. బండ్లగూడ పరిధిలోని దోసెన్ చెరువు నుంచి పటాన్‌చెరు రైల్వే స్టేషన్ వరకు కాలినడకన పర్యటిస్తూ స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల సమక్షంలోనే రైల్వే అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తీసుకుని తనను కలవాలని సూచించారు.ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, పటాన్‌చెరు వరకు ఉన్న రైల్వే వసతిని నిలిపివేసి, రైల్వే ట్రాక్‌తో పాటు సంబంధిత నిర్మాణాలను తొలగించిన తరువాత అక్కడ పేదలు ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. రైల్వే స్థలంలో ఇళ్లు నిర్మించుకోవడం సరికాదని పేర్కొంటూనే, పేదల సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి వారికి న్యాయం జరిగేలా అధికారులను కోరతామని తెలిపారు. త్వరలోనే రైల్వే అధికారులతో కలిసి మళ్లీ పర్యటించి సమస్య పరిష్కారంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అనంతరం ఎంపీ పటాన్‌చెరు రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఒక ప్రైవేట్ వ్యక్తి రైల్వే ప్రహరీకి గేటు ఏర్పాటు చేసి, రైల్వే స్టేషన్ పరిధిని కబ్జా చేసి బోరు వేయించిన విషయాన్ని గమనించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే రైల్వే అధికారులకు ఫోన్ చేసి, పేదలకు నోటీసులు జారీ చేస్తూ స్టేషన్‌ను కబ్జా చేసిన వారిపై ఎలా చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. స్టేషన్‌ను ఆక్రమించిన వారిపై చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.తదుపరి పాత ఈఎస్‌ఐ క్లినిక్ స్థలాన్ని ఎంపీ పరిశీలించారు. ఈ స్థలాన్ని త్వరలోనే కార్మికులకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి కార్మిక శాఖ అధికారులతో కలిసి త్వరలోనే మళ్లీ వచ్చి అవసరమైన చర్యలు ప్రారంభిస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు.
Admin
ప్రజా పిలుపు