ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరులో దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రజానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. బీరంగూడ కమాన్ వద్ద ఏర్పాటు చేసిన మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే పరమావధిగా పాలన సాగించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల అభ్యున్నతి, పేదల సంక్షేమం, విద్యార్థుల భవిష్యత్తు, మహిళల సాధికారత కోసం ఎన్నో విప్లవాత్మక సంక్షేమ పథకాలను అమలు చేశారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు.ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని పేర్కొన్నారు. సమాజంలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే వైఎస్సార్ లక్ష్యమని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు.జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం వైఎస్సార్ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధనకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంకూరి వెంకటేశ్వర్లు, భార్గవ్, వెంకట్రావు, రమేష్, వంశీ, గోపి, కృష్ణారావు, నాగరాజు, అనిల్, అంకమ్మరావు, మహేంద్ర, రమణారెడ్డి, వెంకటయ్య, సదాశివం, పవన్ కుమార్తో పాటు పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కలిసి వైఎస్సార్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి, మహానేత సేవలను స్మరించుకున్నారు.
Admin
ప్రజా పిలుపు