ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని ప్రజావాణి కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, పార్టీ నాయకులు ప్రజావాణిలో మెమోరాండం అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేసి, ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.అలాగే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన ధర్నా నిర్వహించారు. మహిళా ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా వారిని అడ్డుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు లేకుండా సభను ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చే బాధ్యత ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కూడా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Admin
ప్రజా పిలుపు