ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజా పిలుపు ప్రతినిధి, పటాన్‌చెరు:సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని పెద్దకంజర్ల గ్రామంలో హెచ్ఎండీఏ అధికారులు చేపట్టిన కూల్చివేతలు సంచార జాతుల కుటుంబాలను వీధిన పడేశాయి. గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 125/93లో గత ఐదేళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న గంగిరెద్దుల సంచార జాతి కుటుంబాల గుడిసెలను హెచ్ఎండీఏ భూమిగా పేర్కొంటూ అధికారులు కూల్చివేశారు.సుమారు 30 నుంచి 40 గుడిసెలను నేలమట్టం చేయడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులతో కలిసి జీవనం సాగిస్తున్న తమకు ప్రత్యామ్నాయ ఆశ్రయం చూపకుండా గుడిసెలను తొలగించడం అన్యాయమని వారు వాపోతున్నారు.మేము సంచార జాతికి చెందినవాళ్లం. ఊరూరా తిరిగి జీవనం సాగిస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నాం. ఇప్పుడు ఒక్కసారిగా వెళ్లిపోవాలని చెబితే ఎక్కడికి వెళ్లాలి?" అంటూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ఎన్నికల సమయంలో తమ ఓట్లను కోరిన నాయకులు, ఇప్పుడు తమ కష్టాలను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా ఇక్కడే ఉంటున్నప్పటికీ ఏ అధికారి తమను ప్రశ్నించలేదని, ఇప్పుడు మాత్రం భూమి హెచ్ఎండీఏదంటూ గుడిసెలను కూల్చివేశారని ఆరోపించారు.ఈ ఘటనలో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. గుడిసెలలో నివాసం ఉంటున్న కొందరికి మున్సిపల్ అధికారులు ఇంటి నంబర్లు కేటాయించడంతో పాటు 2025-26 సంవత్సరాలకు ఇంటి పన్నులు కూడా వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఒకవైపు మున్సిపాలిటీ అధికారులు పన్నులు వసూలు చేస్తుండగా, మరోవైపు హెచ్ఎండీఏ అధికారులు స్థలం తమదంటూ కూల్చివేతలు చేపట్టడం విడ్డూరంగా ఉందని స్థానికులు విమర్శిస్తున్నారు.శాంతిభద్రతలు కాపాడాల్సిన కొందరు రక్షక భటులే తమను భయభ్రాంతులకు గురిచేశారని బాధితులు ఆరోపించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.గుండం మల్లన్న దేవాలయం సమీపంలో ఎన్నో ఏళ్లుగా ఆశ్రయం పొందుతున్న తమకు ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి ప్రత్యామ్నాయ నివాసాలు కల్పించాలని సంచార జాతుల కుటుంబాలు వేడుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందించి తమకు స్థిర నివాసం ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారు.
Admin
ప్రజా పిలుపు