ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, హైదరాబాద్ మరియు సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్ జి. సుదర్శన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.కార్యక్రమానికి అదనపు సీనియర్ సివిల్ జడ్జి జి. కుమారస్వామి ముఖ్య అతిథిగా, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ధనరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ అవయవదానానికి సంబంధించిన చట్టాలు, నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అవయవదానానికి సంబంధించి వయోపరిమితి, నమోదు ప్రక్రియ తదితర అంశాలను వివరించారు. సంబంధిత అధికారిక విధానంలో నమోదు చేసుకుని ధ్రువీకరణ పత్రం పొందిన వారికి మాత్రమే అవయవదానం చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.ఒక వ్యక్తి మరణానంతరం తన అవయవాలను దానం చేయడం ద్వారా పలువురికి కొత్త జీవితాన్ని అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అవయవదానంపై అవగాహన పెంచుకుని, ఇతరులను కూడా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ధనరాజ్ మాట్లాడుతూ సాధారణంగా మనిషి మరణించిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని, అయితే అవయవదానం ద్వారా మరొకరికి జీవించే అవకాశం కల్పించవచ్చని తెలిపారు. అవయవాల కొరతను కొంతవరకు అధిగమించేందుకు అవయవదానం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అవయవదానంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మరణానంతరం తమ అవయవాలను అవసరమైన వారికి దానం చేసేందుకు స్వచ్ఛందంగా ప్రతిజ్ఞ చేశారు.కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సునీత, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ రవి కుమార్, సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు