ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని మహదేవపురం కాలనీలో పార్కు స్థలాన్ని కబ్జా చేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని హైడ్రా అధికారులు అడ్డుకున్నారు. కాలనీవాసుల ఫిర్యాదుతో స్పందించిన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థలాన్ని పరిశీలించి రక్షణ చర్యలు చేపట్టారు.మహదేవపురం కాలనీలో సర్వే నంబర్ 214లో ఉన్న సుమారు 650 గజాల పార్కు స్థలాన్ని కొందరు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన అధికారులు స్థలాన్ని పరిశీలించి, పార్కు స్థల పరిరక్షణలో భాగంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కాలనీవాసుల ఆరోపణల ప్రకారం, ఇంద్రేశం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కో-ఆప్షన్ సభ్యుడు పార్కు స్థలంలో బోర్ వేయించి ఆక్రమణకు ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని హైడ్రా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు తక్షణమే స్పందించి స్థలాన్ని పరిశీలించి, ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చర్యలు చేపట్టారు.కాలనీవాసులు హైడ్రా అధికారుల తక్షణ స్పందనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, పార్కు స్థలాన్ని పూర్తిగా రక్షించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు.
Admin
ప్రజా పిలుపు