ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా వానాకాలం–2026 పథకం తొలి విడత నిధులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు.తొలి విడతలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో రెండు ఎకరాల వరకు వ్యవసాయ భూమి కలిగిన 2,42,753 మంది అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు రూ.125.83 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, వానాకాలం సాగు ప్రారంభ సమయంలో రైతులకు పెట్టుబడి సాయం అందించడం వల్ల సాగు పనులకు ఊతం లభిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, రైతు భరోసా నిధులు రైతులకు ఆర్థికంగా ఉపయోగపడతాయని తెలిపారు.జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, జిల్లాలో 2.42 లక్షల మందికి పైగా అర్హులైన రైతుల ఖాతాల్లో నిధులు నేరుగా జమ అవుతున్నాయని తెలిపారు. నిధుల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని, రైతులు ఈ సహాయాన్ని సాగు అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రామ్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనితా సంతోష్, జిల్లా స్థాయి అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు