ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజా పిలుపు సంగారెడ్డి, నవంబర్ 10: చలికాలంలో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ సూచించారు. అత్యవసరమైతే తప్ప పొగమంచు సమయంలో ప్రయాణాలు చేయవద్దని, వీలైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో రహదారులపై దట్టమైన పొగమంచు ఏర్పడుతుందని, ఎదురుగా వచ్చే వాహనాలు సైతం స్పష్టంగా కనిపించని పరిస్థితులు ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా తెల్లవారుజామున నుంచి ఉదయం 8 గంటల వరకు పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.వాహనాల లైట్లు వెలిగించినప్పటికీ కొంత దూరంలో ఉన్న వాహనాలు స్పష్టంగా కనిపించవని, ఇలాంటి పరిస్థితుల్లో అధిక వేగంతో ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించారు. పొగమంచులో అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వల్ల వాహనాలు అదుపుతప్పి బోల్తా పడటం, ముందు వెళ్తున్న లేదా ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొట్టడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.వాహనదారులు వేగాన్ని తగ్గించి, ముందు వెళ్తున్న వాహనానికి తగినంత దూరం పాటిస్తూ ప్రయాణించాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు హెడ్‌లైట్లు, ఇండికేటర్లు తప్పనిసరిగా వినియోగించాలని, పొగమంచు సమయంలో లో బీమ్ లైట్లు ఉపయోగించాలని తెలిపారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు.ప్రయాణంలో తొందరపాటు వద్దు.. వేగం కంటే ప్రాణం ముఖ్యం. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ విజ్ఞప్తి చేశారు.
Admin
ప్రజా పిలుపు