ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : సిద్దిపేట జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు,ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి పిలుపునిచ్చారు.మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లోని సమావేశ మందిరంలో బాల్య వివాహాల నిరోధక చట్టం–2006 అమలుపై సంబంధిత శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన జిల్లా స్థాయి కన్వర్జెన్సీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా సర్పంచులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఫంక్షన్ హాళ్లు, దేవాలయాల్లో వివాహాలు నిర్వహించే సమయంలో వధూవరుల వయస్సుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించేలా చర్యలు చేపట్టాలని డీపీఓనుఆదేశించారు.గ్రామస్థాయిలో బాల్య వివాహాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, తహసీల్దార్లు,పోలీసు అధికారులు,మున్సిపల్ కమిషనర్లు,ఎంపీపీలు,సర్పంచులు సమన్వయంతో పనిచేస్తూ నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.పాఠశాలల్లో విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరు కాకపోతే అందుకు గల కారణాలను ఉపాధ్యాయులు గుర్తించి పర్యవేక్షించాలని డీఈఓకు సూచించారు.బాల్య వివాహాలకు ఆర్థిక సమస్యలు కూడా ఒక కారణమవుతున్నందున, సంబంధిత శాఖలు కుటుంబాలకు ఉపాధి,ఆర్థిక ప్రయోజనాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.బాల్య వివాహాలపై సత్వర చర్యలు తీసుకునేందుకు గ్రామస్థాయి కమిటీల సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా స్థాయి కన్వర్జెన్సీ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. మంగళ, గురువారాల్లో నిర్వహించే శానిటేషన్ డ్రైవ్‌ల సందర్భంగా బాల్య వివాహాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కల్పించాలని ఆదేశించారు.ప్రతి పాఠశాలలో బాల్య వివాహాల నిరోధక చట్టం–2006తో పాటు పిల్లలకు కల్పించిన హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా పనిచేసినప్పుడే బాల్య వివాహాలను సమర్థవంతంగా అడ్డుకోగలమని కలెక్టర్ పేర్కొన్నారు.కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ అందె వెంకటేశ్వర్లు బాల్య వివాహాల నిరోధక చట్టం–2006పై అధికారులకు సవివరంగా అవగాహన కల్పించారు. అనంతరం బాల్య వివాహాల నిర్మూలనపై రూపొందించిన వాయిస్ ఓవర్, వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. అధికారులు, సిబ్బందితో బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ రమేష్, డీఆర్వో నాగరాజమ్మ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ధనరాజ్, జిల్లా సంక్షేమ అధికారి శారద, డీపీఓ రవీందర్, రిసోర్స్ పర్సన్ అందె వెంకటేశ్వర్లు, సంబంధిత శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు