ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : గడ్డపోతారం: గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని గడ్డపోతారం గ్రామంలో నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణ పనులను అధికారులు నిలిపివేయడంపై కాంగ్రెస్ పార్టీ పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు నిలిచిపోయిన ప్రాంతాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, స్థానికులు, ఆలయ నిర్వాహకులతో మాట్లాడి సమస్యకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడిన కాట శ్రీనివాస్ గౌడ్, గ్రామ ప్రజలందరి ఆధ్యాత్మిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం చేపడుతుంటే మధ్యలో పనులను నిలిపివేయడం సమంజసం కాదని అన్నారు. గతంలో గ్రామ పంచాయతీ ఆమోదించిన తీర్మానాలు, అనుమతి పత్రాలు ఉన్నప్పటికీ నిర్మాణ పనులకు అడ్డంకులు సృష్టించడం వల్ల భక్తులు, గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.దేవాలయ నిర్మాణం అనేది ప్రజల విశ్వాసాలు, భక్తి భావాలతో ముడిపడి ఉన్న అంశమని, ఇలాంటి విషయాల్లో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అధికారుల చర్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని, సంబంధిత పత్రాలను పరిశీలించి వెంటనే నిర్మాణ పనులు తిరిగి కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. ప్రజల విశ్వాసాలకు, గ్రామస్థుల అభీష్టానికి అనుగుణంగా సమస్యను పరిష్కరించాలని కాట శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
Admin
ప్రజా పిలుపు