ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం పటాన్‌చెరులో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ కోఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పాల్గొని కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో 2014 అక్టోబర్ 2న కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. తొలుత రూ.51 వేలుగా ఉన్న ఆర్థిక సహాయాన్ని రూ.75,116కు, అనంతరం రూ.1,00,116కు పెంచినట్లు పేర్కొన్నారు.ప్రస్తుతం ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్‌ఎస్ నేతలు విమర్శించారు. తులం బంగారం పేరుతో హామీలు ఇచ్చి ప్రజల్లో ఆశలు కల్పించారని ఆరోపించారు. ఆడబిడ్డల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కళ్యాణ లక్ష్మి పథకాన్ని మరింత బలోపేతం చేసి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, నర్రా బిక్షపతి, ఎంపీపీ యాదగిరి, పృథ్వీరాజ్, గూడెం మధుసూదన్ రెడ్డి తదితరులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు