ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు, సెప్టెంబర్ 16: వినాయకుడి నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి చెందడం అత్యంత విషాదకర ఘటన అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామ పరిధిలోని నేరేడుచెరువులో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. శిరీష చారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు నిమజ్జనం కోసం చెరువులోకి దిగగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. మృతులను శ్యామ్ కుమార్, గణేశ్, నర్సింహరాజు, సుమంత్, ఉదయ్ కిరణ్, సిద్ధార్థ్‌గా గుర్తించారు.విషాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నీలం మధు ముదిరాజ్ పటాన్‌చెరులోని గ్లోబల్ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా తీసినట్లు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పేర్కొన్నారు. పోస్టుమార్టం, మృతదేహాల తరలింపు తదితర ప్రక్రియల్లో అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. ఈ మేరకు పోలీసులు చర్యలు కొనసాగిస్తున్నారని వెల్లడించారు.ఆరుగురు విద్యార్థుల మృతితో పెద్దకంజర్లలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం విషాదంగా మారింది.
Admin
ప్రజా పిలుపు