ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను బుధవారం సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ హాజరై కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ మాండలికంలో సామాజిక అంశాలపై రచనలు చేస్తూ ప్రజలను సామాజికంగా చైతన్యపరిచిన గొప్ప ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని కొనియాడారు. తెలంగాణ సమాజానికి, భాషకు కాళోజీ చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించిందన్నారు.కాళోజీ నారాయణరావు జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ప్రతి ఏటా అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహిస్తోందని తెలిపారు. కాళోజీ ఆశయాలు, సాహిత్య స్ఫూర్తి భావితరాలకు అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌డీసీ సుదర్శన్ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి హమీద్, జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ, సమాచార పౌర సంబంధాల శాఖ ఉప కార్యనిర్వహణ ఇంజినీర్ భూపాల్ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి రాజ్‌కుమార్, జిల్లా రవాణా అధికారి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి, తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు